Sunday, June 29, 2008

గణపతి సచ్చిదానంద స్వామీజీ


గణపతి సచ్చిదానంద స్వామీజీ ఒక హిందూ ఆధ్యాత్మిక గురువు. అవధూత దత్తపీఠం వ్యవస్థాపకులు, నిర్వాహకులు. వీరిని దైవ స్వరూపునిగా భక్తులు భావిస్తారు.

స్వామీజీ ఎవరు? అనే ప్రశ్నకు జవాబుగా దత్తపీఠం వెబ్‌సైటులో ఇలా వ్రాసి ఉన్నది -
మీరు ఆలోచిస్తే స్వామీజీ ఎవరో మీకు స్వయంగా అనుభవమౌతుంది. యోగి అనీ, సిద్ధుడనీ, వైద్యుడనీ, మంత్రశక్తులున్నవాడనీ ఇలా రకరకాలుగా అంటుంటారు. వైదికమార్గాన్ని అనుసరిస్తాని కొందరంటుంటారు. అంతా గందరగోళమని మరి కొందరంటుంటారు. అన్నింటిలోనూ నిజముంది. ఎవరి దృష్టికోణం వారికుంటుంది. కాని నేను ఆధ్యాత్మిక వ్యాపారిని మాత్రం కానని నేను అంటాను.
మైసూరులోని అవధూత దత్తపీఠం వీరి ప్రధానకేంద్రం. ఇంకా దేశమంతటా అనేక మఠాలు, పీఠాలు ఉన్నాయి. ధర్మము, భక్తి, భజన, కీర్తన వంటి సంప్రదాయాలు స్వామీజీ బోధించే మార్గాలలో ప్రధానమైనవి. సంగీతం ద్వారా రోగాలను నయం చేయవచ్చునని స్వామీజీ బోధిస్తారు. దీనినే "నాద చికిత్స" అంటారు. స్వయంగా స్వరపరచిన కీర్తనలను స్వామీజీ సంస్కృతం, హిందీ, తెలుగు, కన్నడం, ఇంగ్లీషు భాషలలో సంగీతయుక్తంగా ఆలాపిస్తూ ఉంటే తమకు వాటివలన శారీరిక ఆరోగ్యము, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వము, శాంతి లభించాయని భక్తులు చెబుతుంటారు.
వీరు 1942 మే 26న జయలక్ష్మి, నరసింహశాస్త్రి దంపతులకు కర్ణాటక రాష్ట్రంలో కావేరి నదీ తీరాన "మేకెదాటు" అనే గ్రామంలో జన్మించారు. బిడ్డకు తల్లిదండ్రులు "సత్యనారాయణ" అనే పేరు పెట్టుకొన్నారు. (అతని తల్లి కావేరి నది ఒడ్డున ధ్యానంలో ఉన్న సమయంలో ఆ బిడ్డ జన్మించాడని, పుట్టినపుడే అతని నుదుట విభూతి బొట్టు ఉందనీ దత్తపీఠం వెబ్‌సైటులో ఉన్నది.) చిన్నతనం నుండే ఆ బాలుడు ఆధ్యాత్మిక సాధనల పట్ల, సంగీతం పట్ల విశేషమైన ఆసక్తి చూపారు. 1951లో అతని మాత్రుమూర్తి శివైక్యం చెందడానికి ముందు అతనికి దీక్షనొసగింది.

బడికి వెళ్ళే సమయంలోనే సత్యనారాయణ తన స్నేహితులతో సత్సంగాలు జరిపించడం, కొన్ని అద్భుత సిద్ధులు ప్రదర్శించడం చేసేవాడు. కొంతకాలం అతను పోస్టల్ వర్కర్, స్కూల్ టీచర్ వంటి ఉద్యోగాలు చేశాడు. ఆ సమయంలో అతని సహాయం వలన కష్టాలనుండి బయటపడిన కొందరు అతనికి జీవితాంతం శిష్యులయ్యారు. అతను భజనలు, కీర్తనలు పాడుతుండేవాడు. యోగా నేర్పుతుండేవాడు. క్రమంగా అతని శిష్యుల సంఖ్య పెరిగింది.

1966లో సత్యనారాయణ మైసూరులోని తన ఆశ్రమంలో నివాసం ఏర్పరచుకొన్నారు. అది అప్పటికి పొలంలో ఒక చిన్న పాక. తరువాత సత్యనారాయణ "గణపతి సచ్చిదానంద స్వామి" అనే పేరును గ్రహించారు.ఆశ్రమానికి వచ్చే సందర్శకులు భక్తులు అధికం కావొచ్చారు. స్వామిజీ మరియు అతని భక్తులు దేశమంతటా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినాన స్వామిజీ హోమగుండంలో ప్రవేశించడం, శివలింగం, శ్రీచక్రం వంటి వస్తువులను వెలికి తీయడం భక్తులకు ప్రియమైన అద్భుతకార్యంగా చెప్పబడుతుంది

హైదరాబాద్ పీఠం, దేవాలయాలు
ఈ పీఠం హైదరాబాద్ నుండి దిండిగల్ వెళ్ళే దారిలో కలదు. ఈ మఠం విశాలమైన ఇరవై ఐదు ఎకరాల తోటలో కలదు. చుట్టూ అందమైన ఉధ్యానవనము పెంచారు. సచ్చిదానంద స్వామి వచ్చినపుడు మరియు ఇతర కార్యక్రమముల నిర్వహణకు అన్ని హంగులతో పెద్ద సభాస్థలం కలదు. దానిని ఆనుకొని విశ్రాంతి గదులు ఉన్నాయి. ఇక్కడ కల ఆంజనేయ దేవాలయములోని మూలవిరాట్ మరకతం తో చేయబడినది. ఇదే ఆవరణలో విఘ్నేశ్వరాఅలయము. అమ్మవారి ఆలయములు కలవు. "అమ్మ వొడి" అనే వృద్దుల శరణాలయము ఉంది. ఇక్కడ దాదాపు వందమంది వృద్దులకు వసతి సదుపాయములు కలవు.


No comments: