Sunday, December 30, 2007

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్


డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (Dr. Sarvepalli Radhakrishnan) (సెప్టెంబర్ 51888 – ఏప్రిల్ 171975భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి కూడా. అంతేకాదు భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టినాడని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో(చైనాపాకిస్తానులతో యుద్ద సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు.
అప్పటి దక్షిణభారతదేశంలో మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరమున ఉన్న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యము మరియు విద్యాభ్యాసము ఎక్కువగా తిరుత్తణి మరియు తిరుపతిలోనే గడిచిపోయాయి. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి కళలలో పట్టభద్రుడు అయ్యారు. 1906లో 18 సంవత్సరాల చిరుప్రాయంలో శివకామమ్మతో వివాహము జరిగింది. వీరికి ఐదుగురు కూతుళ్ళు, ఒక కుమారుడు కలిగారు.
1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతి అయిన తరువాత కొందరు శిష్యులు మరియు మిత్రులు, పుట్టిన రోజు జరపటానికి అతనివద్దకు వచ్చినప్పుడు, "నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేను ఎంతో గర్విస్తాను", అని చెప్పి ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ప్రేమను చాటారు. అప్పటినుండి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
ఈయన పాశ్చాత్య తత్వవేత్తలు ఎలా తమ భావనలను తమ సంస్కృతిలో అప్పటికే ఉన్న వేదాంత ప్రభావానికి ఎలా లోనవుతున్నారో చూపించారు. అతని దృష్టిలో తత్వము అనేది జీవితాన్ని అర్ధంచేసుకోవటానికి ఒక మార్గము, భారతీయ తత్వమును అర్ధం చేసుకోవటం అనేది ఒక సాంస్కృతిక చికిత్సగా భావించేవారు. భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, అందులో వివేకము, తర్కము ఇమిడి ఉన్నాయని చూపించి, భారతీయ తాత్వికచింతన ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు

  • మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తాత్విక శాస్త్ర ఉపన్యాసకుడిగా, ఉపప్రాధ్యాపకుడుగా, ప్రాధ్యాపకుడిగా వివిధ పదవులను అలంకరించారు.
  • 1918 నుండి 1921 వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రాధ్యాపకుడిగా (ప్రొఫెసర్) పనిచేసారు.
  • 1921లో, అప్పటి భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో ముఖ్య తాత్విక పీఠమైన, కింగ్ జార్జ్ 5 చెయిర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ కు రాధాకృష్ణన్‌ను నియమించారు.
  • 1926 జూన్‌లో బ్రిటనులో జరిగిన విశ్వవిద్యాలయాల కాంగ్రేసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. తరువాత ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డు విశ్వవిద్యాలయం నిర్వహించే అంతర్జాతీయ తాత్విక కాంగ్రేసులో సెప్టెంబర్ 1926లో కూడా కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు.
  • 1929లో, ఆక్స్‌ఫర్డులోని మాంచెస్టరు కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేయుటకు ఆయనను ఆహ్వానించారు. దీనివలన ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలోని విద్యార్ధులకు "తులనాత్మక మతము"(Comparative Religion) అనే విషయం మీద ఉపన్యాసము ఇవ్వగలిగే అవకాశము వచ్చింది.
  • 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపసంచాలకునిగా (వైస్ ఛాన్సలర్) పనిచేసారు.
  • 1936లోస్పాల్డింగ్ ఫ్రొఫెసర్ ఆఫ్ ఈస్ట్రన్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ అనే పీఠంలో ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలో 1952లో భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించే వరకు కొనసాగారు.
  • 1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి కులపతిగా (వైస్ ఛాన్సలర్) పనిచేసారు.
  • 1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేసారు.
  • 1946 నుండి 1950 వరకు పలుమార్లు భారతదేశం తరుపున యునెస్కో సభ్య బృందానికి అధ్యక్షత వహించారు.
  • 1948లో విశ్వవిద్యాలయాల విద్యా కమీషనుకు అధ్యక్షుడిగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డారు.
  • 1948లో యునెస్కో కార్యనిర్వాహక బృందానికి అధ్యక్షుడిగా ఉన్నారు.
  • 1952లో యునెస్కో అధ్యక్షునిగా ఎంపికయ్యారు.
  • 1962లో బ్రిటీషు ఎకాడమీకి గౌరవసభ్యునిగా ఎన్నుకోబడ్డారు
  • ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
  • 1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్టాత్మక సర్ బిరుదు ఈయనను వరించింది.
  • 1954లో మానవ సమాజానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు పొందారు.
  • 1961లో జర్మనీ పుస్తక సదస్సు యొక్క శాంతి బహుమానం (Peace Prize of the German Book Trade) పొందారు.
  • 1963 జూన్ 12న బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కి గౌరవ సభ్యునిగా ఎన్నుకోబడ్డారు.
  • ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలయిన ఆక్స్‌ఫర్డు, కేంబ్రిడ్జి, మొదలయినవాటి నుండి వందకు పైగా గౌరవ పురస్కారాలు మరియు డాక్టరేటులు సంపాదించారు.
  • ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయము సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణార్ధం రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్ను ప్రకటించింది